Tuesday, May 26, 2015

సౌందర్యలహరి..............13

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

వయసున్మీఱిన, గ్రుడ్డివాడయిన, నప్రాజ్ఞుండునే సద్రతిన్
నయనాపాంగవిలోకనంబులను కన్నన్ మీఱలేపారగా
జయవెట్టంగలరెల్లజవ్వనులు కేశంబుల్ ముడుల్వీడగా 
బయటల్ జారగ, కాంచికల్ సడలగా బాయంగనీవుల్ వెసన్!!!............13

సౌందర్యలహరి.................12

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

గిరిసుతసుందరాకృతిని కీర్తనసేయగ, పోల్కిసెప్పగా
నెఱుగక ధాతయుం,గవులు నీడిగిలంబడిరేమిసెప్పనౌ  
సురలలనామణుల్ తపముచొప్పున తాముగ్రహింపనేరకన్
బొఱయుదురాత్మ వాంఛమెయి భూరిసమైక్యత దేవదేవుతో!!!..........12

సౌందర్యలహరి...................11

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

నలుగురు రుద్రులున్, మఱియునల్వురునొక్కరునైన శక్తులున్ 
నలుగురునేవురై మివులనల్వుదలిర్పగ మూలకారణాల్ 
నలుబదినాల్గుకోణముల నాలుగురుద్రరధాంగరంగముల్
చెలువగుశక్తిచక్రములు శ్రీశరణంబుననైదుగూడగా
వెలయుదు రుద్రశక్త్యుభయవిశ్వజనీనమహత్తరాకృతిన్!!!................................11  

సౌందర్యలహరి...................10

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

నీపాదామృతధారలన్ దడిసి నిర్నిద్రప్రసారస్థితిన్  
రూపుందాల్పగ సర్వనాడులును, నారూఢస్థితిన్ చంద్రమః
శ్రీపర్యాప్తి యధాస్థితింబడసి భూరిప్రాభవౌన్నత్యముల్ 
చేపట్టంగలవీవు నిద్దురను నిశ్చేయంబు మూలంబుగన్!!!............10   

సౌందర్యలహరి..................9

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

అవనీమహాతత్వమాధారచక్రంబు, 
                 వారితత్వము మణిపూరకంబు, 
నగ్నితత్వమునగు నాయధిష్ఠానము, 
                 ననిలతత్వమనాహతాహ్వయంబు,
నాకాశతత్వసమాశ్రితము విశుద్ధము, 
                 మనఃప్రభాంచితమున్ సదాజ్ఞ,
అట్టిషట్చక్రములధిగమించి సుషుమ్న
                 పథముజీల్చి చరించి పరమమైన

ఆ సహస్రారపద్మమునందువెల్గు 
నాసదాశివునంకమునందుజేరి
క్రీడసల్పుజగన్మాతకేలుమోడ్చి
భక్తిసంభావనముసేసి ప్రస్తుతింతు!!!.................9

Monday, May 25, 2015

సౌందర్యలహరి........8

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

అలరుసుధాబ్ధిమధ్యమున నాసురభూరుహసంయుతంబు, ని 
ర్మలమణిరంతరీపమున మానగునీపవనాంతరంబునం
దల సురరత్నసౌధమున నాశివశక్తిసురూపతల్పమం
దలఘుసదాశివాంకమున నల్లననిల్చినతల్లి గొల్చెదన్!!!.........8 

సౌందర్యలహరి........7

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

ఘలుఘలుఘల్లుఘల్లుమని గజ్జలకాంచిక కుంభికుంభముల్ 

గులగులసేయుగుబ్బలును, గుప్పిటబట్టగనైన మధ్యమున్
కలలుపదారుచేకొనిన కల్వలమిత్రునిబోలుమోము, నమ్ములు,
విలు,పాశమంకుశము  పూనుకరమ్ముల నిల్వవే? శివా!!!............7 

సౌందర్యలహరి........6

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

అంటినవాడు పూలువిలునై, మఱియొక్కటికొక్కడెందు దా 

మంటనితేంట్లు నారిగను, నైదవిలెక్కకుపూలు నమ్ములై 
యుంట, జడుండు మంత్రిగనునుంట, సమీరుడు సద్రధంబుగా 
బంటయి లోకముల్ గెలుచు భావజుడేమనవచ్చు నీకృపన్!!!.............6

Sunday, May 24, 2015

సౌందర్యలహరి........5

సౌందర్యలహరి
సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

హరి శ్రీచక్రసురూపధారిణిని  నిన్నర్చించి స్త్రీరూపియై
పరమాత్మున్ హరునంతవాని మునుముంపంజాలె మోహాంబుధిన్
స్మరుడౌరా! రతికంటికాటుకగుచున్  సన్మౌని హృన్మండలిన్
పరివేధించి విమోహవార్ధిమునుచున్ భవ్యాత్మ! నీసత్కృపన్!!!.....5

సౌందర్యలహరి.........4

సౌందర్యలహరి
సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు
దేవతలెల్ల హస్తముల దీప్తివహింపగ భద్రముద్రలన్,
నీవుభవత్కరంబులను నిల్పవుముద్రలు నందుకైదగన్,
దేవి! భవత్పదంబులవి నేర్చెనుగా నభయప్రదంబులై,
శ్రీవిలసిల్లి ముఖ్యవరసిద్ధియొనర్పగ మించివాంఛలన్!!!............4

సౌందర్యలహరి............3

సౌందర్యలహరి

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"

ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

పాపనవిద్య సూర్యఖని, పాపదరిద్రత దేవరత్నమౌ,

బాపజడత్వమున్ పరమభవ్యసచేతన పుష్పసారమౌ,

పాపిభవాబ్ధి మింటనిలుపంగను విష్ణువరాహదంష్ట్రయౌ,

నీ పదపాంసుజాలమది నిక్కమెరింగి వచింపనేర్చినన్!!!.........3

Saturday, May 23, 2015

మా తాతగారు కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావుపంతులుగారు

   కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావుపంతులుగారు

సౌందర్యలహరి.............2

సౌందర్యలహరి

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"

ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

నీపదరేణువుం బడసి నీరజగర్భుడు సృష్టికర్తయౌ,

నీపదరేణువుం దలలనిల్పును వేయిట విష్ణువాదటన్,

నీపదరేణువున్మెదిపి నేరుపునన్ హరుడంగరాగసం

దీపనసిద్ధినొందు జననీ! నిను వర్ణనసేయనేర్తునే?........2

సౌందర్యలహరి...................1

సౌందర్యలహరి

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"

ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

శక్తిం గూడియె యీశ్వరుండు సృజియించం జాలు లోకంబులన్

శక్తిం బాసిన కాలు,కేలు కదుపన్ సాధ్యంబె యెవ్వానికిన్

శక్తిం గొల్తురు బ్రహ్మ,విష్ణు,హరులున్ సర్వార్థసంసిద్ధికై

శక్తిన్ సన్నుతిసేయుపుణ్యమెడగా సంప్రజ్ఞులెట్లౌదురో?.........1

కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావుపంతులుగారు

మా తాతగారు కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావుపంతులుగారు తెలుగులో 13 పద్యరచనలు చేసియున్నారు. ఆ కృతులను ఆంధ్రభాషాభిమానులకు పరిచయము చేయాలనే సంకల్పమే ఈ బ్లాగ్ ఆవిర్భావం. దీనిలోని సారాన్ని మిత్రవర్యులందరు ఆస్వాదించుదురుగాక!!!..............కొర్నెపాటి విద్యాసాగర్, మేనేజర్ పి.బి.డి., భారతీయ స్టేట్ బ్యాంక్, విజయవాడ.